Showing posts with label ఊసులు. Show all posts
Showing posts with label ఊసులు. Show all posts

Sunday, 27 October 2013

నులక మంచం..


ఏటి ఒడ్డున మా ఊరు 
ఏటి మద్దెన మా బావుండు

కేకేస్తే  సేపలు కూరకు లోటేనేదు
సప్పుడు సేత్తే కల్లు ముంతకు తిరుగేనేదు

నువు ముట్టుకుంటే జువ్వు మంటాది బావా
నువు రాక ఈ ఏటి పాయ మింగ సూత్తోంది రావా

ఎన్నెల  రాతిరంతా ఈ నులక మంచం కిఱుమనక 
ఏప సెట్టు దిగాలుగా ఆకులు రాలుస్తోంది బావా

ఆ బంతి పూవు కోసి ఈ కనకాంబరం ఏరుకొని
నా సిగలో తురిమి దీపావళి తారాలా దూసుకుపోవా

 

Wednesday, 23 January 2013

దాహపు శాపం...

ఈ  సలి రాతిరి
నన్నొంటరిజేసి
ఈ తడిక మాటున
వీడిపోకుమా...

నీ తడి అంటిన
పెదవి తాపంతో
తహ తహలాడుతోంది..

నీ పంటి గాటు
పడిన చోట
తీయని మంట
కాగుతోంది...

అందీ అందకుండా
ఊరించానని
నన్ను ఈ దాహపు
శాపానికి గురిచేయకు...

Friday, 14 December 2012

ఏడ దాచేదే సెల్లీ..

ఆ సుప్పనాతోడు 
సుక్కను కోసుకొచ్చి 
నీ నుదుట బొట్టెడతానని ఎల్లినాడే సెల్లీ...

సుక్క తేనేదు కానీ 
పూటుగా సుక్కేసుకొచ్చి 
ఇన్ని బొండు మల్లెలు తలలో తురిమినాడే సెల్లీ...

ఆ ఏటి నురగనంతా దోసిట పట్టి
నీ బుగ్గ నిమురుతానన్నాడే సెల్లీ...

నురగ తేనేదు కానీ 
కళ్ళలో ఎఱ జీరలతో ఎగబడ్డాడే సెల్లీ...

జిలేబీ  పొట్లం తెస్తానన్నాడే సెల్లీ
పొట్లం ఏదిరా అని సూత్తే
నీకన్నా జిలేబీ తీయగుంటదా అంటాడే సెల్లీ...

ఈ తాపమోపలేనే సెల్లీ...
ఈడినాపలేనే ఈడునాపుకోలేనే సెల్లీ...

వాడి  కోర మీసం 
మిట్ట పిల్లలా మిల మిలా మెరుస్తూ 
పెదవి సివర గుచ్చుతుంటే 
ఏడ దాగేదే సెల్లీ
ఏడ దాచేదే సెల్లీ...

బుల్ బుల్ పిట్టా బుల్లి పిట్టా అంటూ
గుబులు రేపుతుంటే ఏడ పోయేదే సెల్లీ...

దాసేత్తే దాగని మనసు 
ఇలా ఎగసి ఎగసి పడుతుంటే 
ఏటి ఒడ్డున పడ్డ సేపలాగున్నానే సెల్లీ...