Friday 14 December 2012

ఏడ దాచేదే సెల్లీ..

ఆ సుప్పనాతోడు 
సుక్కను కోసుకొచ్చి 
నీ నుదుట బొట్టెడతానని ఎల్లినాడే సెల్లీ...

సుక్క తేనేదు కానీ 
పూటుగా సుక్కేసుకొచ్చి 
ఇన్ని బొండు మల్లెలు తలలో తురిమినాడే సెల్లీ...

ఆ ఏటి నురగనంతా దోసిట పట్టి
నీ బుగ్గ నిమురుతానన్నాడే సెల్లీ...

నురగ తేనేదు కానీ 
కళ్ళలో ఎఱ జీరలతో ఎగబడ్డాడే సెల్లీ...

జిలేబీ  పొట్లం తెస్తానన్నాడే సెల్లీ
పొట్లం ఏదిరా అని సూత్తే
నీకన్నా జిలేబీ తీయగుంటదా అంటాడే సెల్లీ...

ఈ తాపమోపలేనే సెల్లీ...
ఈడినాపలేనే ఈడునాపుకోలేనే సెల్లీ...

వాడి  కోర మీసం 
మిట్ట పిల్లలా మిల మిలా మెరుస్తూ 
పెదవి సివర గుచ్చుతుంటే 
ఏడ దాగేదే సెల్లీ
ఏడ దాచేదే సెల్లీ...

బుల్ బుల్ పిట్టా బుల్లి పిట్టా అంటూ
గుబులు రేపుతుంటే ఏడ పోయేదే సెల్లీ...

దాసేత్తే దాగని మనసు 
ఇలా ఎగసి ఎగసి పడుతుంటే 
ఏటి ఒడ్డున పడ్డ సేపలాగున్నానే సెల్లీ...